: సమ్మె ఆపేది లేదు... ఆ ఐఏఎస్ పై చర్యలు తీసుకోవాలి: అశోక్ బాబు
సమ్మె విరమించేది లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సమావేశమయ్యామని, విడిపోతే ఉద్యోగాలకు వచ్చే నష్టమేంటని ఆయన అడిగారని అశోక్ బాబు చెప్పారు. తాము రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నామని ఆయనతో చెప్పామన్నారు. అయినా విడిపోతే సమస్యలేంటి? అని అడిగారని.. తామింత బాధ పడుతున్నా ఉద్యోగుల సమస్యలే తెలియకపోతే న్యాయం ఎలా చేస్తారని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు న్యాయం జరుగుతుందనో, లేదా, రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనో స్పష్టం చేయాలని.. ఆప్పుడే తాము సమ్మె విరమణ గురించి ఆలోచిస్తామని అశోక్ బాబు తేల్చి చెప్పారు.
కాగా, సమ్మె అయిపోయిన తరువాత.. సమ్మెలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు 6 లక్షల మంది ఉద్యోగుల జీతంలో కొంత భాగం అమరుల కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. టీచర్లు సెలవులు తీసుకోకుండా సిలబస్ పూర్తి చేస్తామని తెలిపినట్టు చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్ల ఉద్యోగులను ఓ ఐఏఎస్ అధికారి బెదిరిస్తున్నారని.. తన విధులేమిటో తెలియని ఆ ఐఏఎస్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగిస్తున్నారన్న అశోక్ బాబు, తాము అన్నీ కోల్పోయి శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారని తెలిపారు. అన్ని సంఘాలు నిన్న సమావేశంలో తీర్మానం చేసినట్టు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ నిర్ణయాన్ని వ్యతిరేకించే హక్కు ప్రజలుగా తమకు ఉందని అశోక్ బాబు తెలిపారు.
ఎస్మా అంటూ భయపెడితే తాము భయపడేది లేదని, దేశ చరిత్రలోనే సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వం సంస్థల ఉద్యోగులు ఉద్యమబాట పట్టారని అలాంటిది తమను పట్టించుకోరా? అని ఆయన ప్రశ్నించారు.