: మూతబడిన అమెరికా కార్యాలయాలు.. భారత్ పై ప్రభావం
ప్రభుత్వానికి నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రభుత్వ సంస్థల మూసివేతకు అమెరికా శ్వేతసౌధం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో, వేలాదిగా ఉద్యోగులు సెలవుపై వెళ్ళిపోయారు. దాదాపు పదిహేడేళ్ల తర్వాత అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నిలిచిపోవడం ఇదే తొలిసారి. అయితే అమెరికాలో నెలకొన్న సంక్షోభ ప్రభావం మన దేశం మీద కూడా పడనుందని వివిధ ఆర్థిక సంస్థలకు చెందిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి విశ్లేషణల్లో కొన్నింటిని చూద్దాం....
1. మన దేశ ఐటీ కంపెనీలపై అమెరికా ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ఈ పరిస్థితి 15 రోజుల వరకు కొనసాగితే... కొత్త వీసాలు మంజూరు చేయడం సాధ్యమవదు. అక్టోబర్ 1 నుంచి కొత్త సంవత్సర వీసాలు జారీచేస్తారు. కాబట్టి కొత్త వీసాలు రానట్టే.
2. అమెరికా డాలరు తో పోలిస్తే బాగా బక్కచిక్కిపోయిన మన రూపాయి... గత నెలలో కొంత వరకు కోలుకుంది. అయితే, అమెరికా లో 'షట్ డౌన్' ఇలాగే కొనసాగితే... అది మన ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దాంతో డాలర్ల రాక తగ్గి... మన రూపాయి విలువ మరింత పతనమవుతుంది.
3. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్లు దెబ్బతింటే... దాని ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై పడుతుంది. ఇప్పటికే గత ఏడు రోజులుగా అమెరికా డౌజోన్స్ డౌన్ ట్రెండ్ లో ఉంది.
4. ఫైనాన్షియల్ (ఈక్విటీలు, బాండ్లు, కరెన్సీ, డెరివేటివ్స్,....) మార్కెట్లు దెబ్బతింటాయి.
5. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాల్లో అప్పుడప్పుడు ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తుతూ ఉంటాయి. ఏదో విధంగా వాటిని అధిగమించే ప్రయత్నాలు జరుగుతుంటాయి. తాజాగా అన్నీ సర్దుకున్నాయనుకుంటున్న సమయంలో.. ప్రస్తుతం అమెరికాలో నెలకొన్న సంక్షోభం మన దేశంతో పాటు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపబోతోంది.