: కాంగ్రెస్ ఎంపీ మసూద్ కు నాలుగేళ్ల జైలుశిక్ష
కాంగ్రెస్ ఎంపీ రషీద్ మసూద్ (66)కు ఢిల్లీ కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది. వైద్య విద్య సీట్ల కుంభకోణంలో మసూద్ కు ఈ శిక్ష ఖరారైంది. 1990వ దశకంలో.. వీపీ సింగ్ మంత్రివర్గంలో ఆరోగ్యమంత్రిగా ఉన్న రషీద్ తన అధికారబలంతో అనర్హులైన విద్యార్ధులకు వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ వెంటనే కోర్టు ఆదేశంతో సీబీఐ విచారణ జరిపింది. దాంతో, రాజ్యసభ సభ్యుడైన మసూద్ కు ఏడేళ్ల జైలుశిక్ష విధించాలని కోర్టును సీబీఐ ఈ ఉదయం కోరింది. అటు తన వయసు, చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని తీర్పు ఇవ్వాలని మసూద్ కోరారు. ఆయన అభ్యర్ధనను తిరస్కరించిన కోర్టు శిక్ష విధించింది. రెండేళ్లకు పైగా శిక్ష పడితే రాజకీయ నేతల సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేటుపడనున్న తొలి పార్లమెంటు సభ్యుడు రషీదే కానున్నారు.