: పిల్లలు సిగరెట్ బ్రాండ్లను గుర్తించేస్తారట
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూడింట రెండొంతుల మంది పసిపిల్లలు కనీసం ఒక సిగరెట్ బ్రాండ్‌ను అయినా గుర్తించగల స్థితిలో ఉంటున్నారట. అమెరికాలో జరిగిన ఒక అధ్యయనం పసిపిల్లలే సిగరెడ్ బ్రాండ్‌లను గుర్తించేస్తున్నారంటూ లెక్క తేల్చింది. పొగాకు కంపెనీలు అనుసరిస్తున్న పబ్లిసిటీ టెక్నిక్కులు.. అయిదారేళ్ల వయసున్న పసిపిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయనే విషయంలో ఈ అధ్యయనం నిర్వహించారు. పరిస్థితి ఇలా ఉండడం వల్లనే వారు పెద్దయ్యాక సులభంగా పొగతాగడానికి అలవాటు పడుతున్నారని ఆ అధ్యయనం లెక్క చెబుతోంది.
పబ్లిక్ హెల్త్‌కు సంబంధించి మేరీల్యాండ్ స్కూల్, జాన్ హాప్కిన్స్ స్కూలు పరిశోధకులు ఇద్దరూ కలిపి ఈ అధ్యయనం నిర్వహించారు. బ్రెజిల్, చైనా, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్, రష్యా లలో అయిదారేళ్ల పిల్లలను కలసి వివరాలు సేకరించారు. వివిధ ఉత్పత్తుల లోగోలతో కలిపి సిగరెట్ కంపెనీల లోగోలను కూడా ఉంచినప్పుడు పిల్లలు సులభంగా సిగరెట్ లోగోలను గుర్తించేస్తున్నట్లు వారు చెబుతున్నారు.
మరి ఇంత బాగా పబ్లిసిటీ సిగరెట్లను పసిపిల్లల ప్రపంచంలోకి కూడా తీసుకెళ్లిపోతున్నప్పుడు.. పొగతాగే వ్యసనం మరింతగా ముదిరిపోతుందనడంలో సందేహం ఏముంది.