: నిన్న నిజాం కాలేజీలో జరిగింది పెట్టుబడి ఉద్యమం: లగడపాటి
హైదరాబాదు నిజాం కళాశాలలో నిన్న జరిగిన సకలజనుల భేరి సభ పెట్టుబడి ఉద్యమమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విమర్శించారు. ఆ సభలో సీఎం కు డెడ్ లైన్లు పెడుతూ, రాష్ట్రపతి పాలన విధించాలని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. భూకంపం సృష్టిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని దుయ్యబట్టారు. ఇక, కర్నూలులో ఆదివారం ఏపీఎన్జీవోలు జరిపిన సభ కట్టుబడి ఉద్యమమని ఆయన అభివర్ణించారు. ఆ సభ వెనుక నాయకులు లేరని.. ఉద్యోగులు, ప్రజలే ఉన్నారని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల తర్వాత గల్లంతవుతుందని జోస్యం చెప్పారు. ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో పది శాతం ఓట్లు కూడా రాలేదని లగడపాటి ఎద్దేవా చేశారు.