: హైదరాబాదులో జగన్ భారీ బహిరంగ సభ


రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోందని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదు లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ.. 16 నెలలుగా గూడుకట్టుకున్న బాధ కాస్తో కూస్తో వెల్లడిస్తున్నానని అన్నారు. వచ్చే నెల 13 తరువాత హైదరాబాదులో 'శంఖారావం' పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తానని, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నిజాయతీతో కూడిన రాజకీయాలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలు సమైక్యతను కోరుకుంటున్నారని, రాజకీయాలు చేసేవారే తప్పుడు వ్యాఖ్యానాలతో ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని ఆయన అన్నారు.

న్యాయం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్న నేతలు సమైక్యాంధ్రకు మద్దతుగా నిలబడగలరా? అని సవాలు విసిరారు. తాను రాష్ట్రాన్ని పరిపాలిస్తానని, ఎవరికీ అన్యాయం జరుగకుండా చూసుకుంటానని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి దారి చూపడం మానేసి, విభజన ఎలా చేస్తారని అడిగారు. రాష్ట్రానికి ఆయువుపట్టుగా నిలిచిన హైదరాబాదును ఎలా ఒక ప్రాంతానికే కేటాయిస్తారని నిలదీశారు. పరిష్కారం చేతకాకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని ఆయన సూచించారు. రాష్ట్రం ఎందుకు సమైక్యంగా ఉండాలో తాను చూపిస్తానని అన్నారు.

ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారని ఆయన టీడీపీని ప్రశ్నించారు. నోట్ తయారు కాకముందే అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి నోట్ ను అడ్డుకుందామని జగన్ పిలుపునిచ్చారు. అసెంబ్లీని సమావేశపరచమని ఆయన గవర్నర్ ను కోరినట్టు తెలిపారు.

సమైక్యాంధ్ర కోసం తీర్మానం చేస్తూ జేఏసీ ఉత్తరం రాస్తే పార్టీ అధ్యక్షుడిగా తొలి సంతకం తానే చేస్తానని జగన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యేందుకు తానేమీ చంద్రబాబును కాదని అన్నారు. సమైక్యానికి కట్టుబడిన పార్టీలు వైఎస్సార్సీపీ, సీపీఎం, ఎంఐఎం మాత్రమేనని అయన తెలిపారు.

  • Loading...

More Telugu News