: మోగుతున్న డెంగ్యూ ఘంటికలు!
డెంగ్యూ.. ఇదో ప్రాణాంతక వ్యాధి. దోమల కారణంగా వ్యాపిస్తుంది. భారతదేశంలో దీని బారిన పడినవారి సంఖ్య చాలానే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మొత్తం 32వేల కేసులు నమోదైతే, దాదాపు వందమందిపైనే చనిపోయినట్లు తేలింది. ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్ లో డెంగ్యూ తీవ్రంగా విస్తరించింది. గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లా కలెక్టర్ రాజేంద్ర కుమార్ కూడా ఈ వ్యాధి బారిన పడినట్లు తేలింది. ఓ రోజు అనుమానంతో తన రక్తం పరీక్ష చేయించుకోగా డెంగ్యూ అని తేలిందని, దాంతో, బాగా సన్నబడటంతో, ఈ నెల మొదటివారంలో ఆసుపత్రిలో చేరినట్లు కుమార్ చెప్పారు. తమ జిల్లాలో ఈ ఏడాది 280 కేసులు నమోదయ్యాయన్నారు. అహ్మదాబాద్ లో 900 కేసుల్లో డెంగ్యూ నిర్ధారణ అయిందని తెలిపారు.
ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే.. ఆగస్టు నెలలో పుణెలో ఇద్దరు మరణించారు. అటు ముంబయిలో దర్శకుడు యశ్ చోప్రా డెంగ్యూతో అతి తక్కువ వ్యవధిలోనే చనిపోయారు. గ్రేటర్ ముంబయిలో 500 కేసులు, రాష్ట్రవ్యాప్తంగా 2,600 కేసులు నమోదయ్యాయి. అందులో 31మంది మరణించారు. 'నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్' గణాంకాల ప్రకారం 32వేల డెంగ్యూ కేసులు నమోదైతే, అందులో వందమందికి మరణం తప్పలేదు.