: చందమామను భూమి లాగేసుకుందట!


నిజానికి చందమామ భూమికి సంబంధించినవాడు కాదట... శుక్రగ్రహానికి చెందిన వాడట... కానీ భూమి తన ఆకర్షణ శక్తితో చందమామను తన కక్ష్యలోకి లాక్కొనేసిందట. ఈ విషయాలను శాస్త్రవేత్తలు తాజా అధ్యయనం ద్వారా సూత్రీకరిస్తున్నారు.

ఉపగ్రహాలు ఆకర్షణ శక్తి కారణంగా ఆయా గ్రహాల కక్ష్యలలో భ్రమిస్తుంటాయి. ఇలాంటి ఉపగ్రహాలకు సంబంధించి భూమికి ఉన్న ఒకే ఒక సహజ ఉపగ్రహం చంద్రుడు. అయితే ఈ చంద్రుడు కూడా భూమికి చెందిన ఉపగ్రహం కాదని, అది ఒకప్పుడు శుక్రుడి కక్షలో ఉండేదని, భూమి తన ఆకర్షణ శక్తితో చంద్రుడిని తన కక్ష్యలోకి లాక్కున్నట్టుగా కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాల్‌టెక్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తాజా అధ్యయనంలో సూత్రీకరించారు.

సుమారు 450 కోట్ల ఏళ్ల కిందట భూమిని ఒక పెద్ద శకలం ఢీకొనడం వల్ల చంద్రుడు ఏర్పడినాడనే వాదన ఎప్పటినుండో ఉంది. అయితే ఇప్పుడు చంద్రుడు శుక్ర గ్రహానికి చెందిన వాడని కాల్‌టెక్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెప్పడంతో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గురించి సదరు విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ డేవ్‌ స్టీవెన్సన్‌ కూడా తాము నిర్వహిస్తున్న ఈ అధ్యయనంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. చంద్రుడు, భూమిల భూరసాయన సంవిధానం ఒకేలా ఉండడం ఈ కొత్త సిద్ధాంతం నిజమని చెప్పడానికి ప్రధాన అవరోధమని స్పేస్‌.కామ్‌ అభిప్రాయపడుతోంది. చంద్రుడు, భూమికి చెందిన ఐసోటోప్‌లు ఒకేలా ఉన్నాయని గతంలో నాసా కూడా తేల్చింది.

దీని ప్రకారం చూసినా కూడా ఈ సరికొత్త సిద్ధాంతాన్ని అంగీకరించలేము. అయితే శుక్రుడు, భూమి సమీపంలో ఉండడం, దాదాపు ఒకే ద్రవ్యరాశి కలిగివుండడం ఈ రెండు అంశాలు మాత్రమే ఈ సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నాయి. చంద్రుడు, భూమిలను పోలిన సమ్మేళనమే శుక్రగ్రహానికి కూడా ఉందని తేల్చగలిగితే ఈ సిద్ధాంతానికి మరింత బలం చేకూరుతుంది.

  • Loading...

More Telugu News