: సమైక్యాంధ్ర ఉద్యమమంటే ఇదే: అశోక్ బాబు
సమైక్యాంధ్ర ఉద్యమమంటే ఎలా ఉంటుందో కర్నూలులో జరుగుతున్న ఉద్యమ సభను ప్రత్యక్షంగా వచ్చి చూస్తే తెలుస్తుందని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంపై తెలంగాణ వాదులు విమర్శలు చేయడం తగదన్నారు. రాయలసీమలో కర్నూలు జిల్లాకు ప్రత్యేక స్థానముందని, నల్లమలలో పులులే కాదు వాటిని తరిమే మేకలు కూడా ఉన్నాయన్న విషయాన్ని రాష్ట్ర విభజనవాదులు గుర్తించాలని ఆయన అన్నారు. తమ ఉద్యమంపై రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసినా పట్టించుకోబోమన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో నేతలు లేరని ప్రజలున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన తీర్మానానికి నిరసనగా అక్టోబర్ ఒకటి నుంచి సీమాంధ్రకు చెందిన ఎంపీలంతా తమ పదవులకు రాజీనామాలు చేయాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతిని తాము ఎప్పుడూ అవమానపరచలేదని, తెలంగాణ ప్రజలు మంచి మనసున్న వారని, కాకపొతే వారి అమాయకత్వాన్ని కొందరు నాయకులు తమ పదవుల కోసం వాడుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావాలంటే పదవులు మీరే తీసుకోండని, ప్రజలను వేరు చేసి రాష్ట్రాన్ని చీల్చవద్దని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే రైతులు తీవ్రంగా నష్ట పోతారన్నారు. వర్షాలు పడకపోతే ప్రాంతాల మధ్య నీటి యుద్ధాలు తప్పవని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు కలిసి వుంటేనే అభివృద్ధి సాధ్యమని అశోక్ బాబు అన్నారు. విద్యార్ధుల భవిష్యత్తు కోసమే తామీ ఉద్యమం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణ వాదులు హైదరాబాద్ లో నిర్వహించిన సభకు పది జిల్లాల నుంచి ప్రజలు వస్తే, కర్నూలు నగరంలో నిర్వహించిన సభకు కేవలం కర్నూలు నుంచే లక్షల మంది రావటం సమైక్యతకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో తీసుకెళ్లాలని ఆయన సమైక్యవాదులకు పిలుపునిచ్చారు.