: అక్టోబరు 6 వరకే కిరణ్ ముఖ్యమంత్రి : కేసీఆర్
తెలంగాణతో గోక్కున్నోడెవడూ బాగుపడలేదని సీఎం కిరణ్ ను కేసీఆర్ హెచ్చరించారు. పిచ్చి ప్రయత్నాలు మానుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. ఆయన అన్నీ అబద్దాలే చెపుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా కిరణ్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక ప్రాంతం గురించే మాట్లాడటం సబబేనా? అని ప్రశ్నించారు. అక్టోబర్ 6 వరకే సీఎం పదవిలో ఉంటారని ఆయన జోస్యం చెప్పారు. సీఎం కిరణ్ వ్యవహారం ఆరిపోతున్న దీపానికి వెలుగెక్కువన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆంధ్రా జేఏసీ అధ్యక్షుడుగా కిరణ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణను ఎదుర్కోవాలనుకున్న చంద్రబాబు అడ్రస్ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తెలంగాణపై ఎన్ని టర్న్ లు తీసుకుంటారో తెలపాలని అన్నారు. ఆంధ్ర ప్రాంతానికి ఐదు లక్షల ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు కోరారని... ఒక వేళ ప్యాకేజీ ఇస్తే తెలంగాణకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర రెడ్డి పావురాల గుట్టలో పావురమై పోయారని అన్నారు. లక్షమంది కిరణ్ కుమార్ రెడ్డిలు, చంద్రబాబులు, జగన్ లు వచ్చినా తెలంగాణను అడ్డుకోలేరని అన్నారు. వైసీపీ వాళ్లు సమన్యాయం అంటున్నారని... అసలు వైసీపీ వాదనలో న్యాయమే లేదని కేసీఆర్ మండిపడ్డారు.
జై తెలంగాణ అన్న కానిస్టీబుల్ ను కొట్టారని... మరి రోజూ జై సమైక్యాంధ్ర అంటున్న సీఎంను ఏం చేయాలని? ప్రశ్నించారు. తెలంగాణ జిల్లాలలో ఈ సభను టీవీల్లో చూడకుండా.... కరెంటు కట్ చేశారని విమర్శించారు. ఆంధ్రాలో మేధావులున్నారో? లేదో? అన్న అనుమానం వస్తోందని అన్నారు. ఇక్కడ దోపిడీ కొనసాగించడానికే సమైక్యాంధ్ర అంటున్నారని విమర్శించారు. తల తెగిపడినా సరే దోపిడీని మాత్రం కొనసాగనివ్వమని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో రెండు జాతీయ ప్రాజెక్టులు నిర్మించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తో కూడిన తెలంగాణను సాధించేంత వరకు మనం ఇదే ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రాపార్టీలన్నీ ఒకటే అని... ఆంధ్రలో పుట్టినోళ్లందరూ తెలంగాణను దోచుకోవాలని చూసేవారేనని విమర్శించారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులేనని... ఆంధ్రలో పుట్టినవాళ్లంతా తెలంగాణ ద్రోహులేనని అన్నారు. నలిగిపోయిన వారు, నాశనమైపోయిన వారు తెలంగాణవారేనని కేసీఆర్ అన్నారు. పార్టీలన్నిటికీ తెలంగాణ ఓట్లు కావాలిగానీ... తెలంగాణ బాధలు మాత్రం పట్టవని ఎద్దేవా చేశారు. ఉద్యమం చేసే బిడ్డలు సింహంలా ఉంటారని అన్నారు. సీమాంధ్ర ఉద్యమంలో మాదిని గడ్డి తినడం, పతంగులు ఎగురవేయడం, చెర్నాకోల్ తో కొట్టుకోవడం కాదని అన్నారు. ఆకులు, కోడి ఈకలతో చేసేది ఉద్యమం కాదని విమర్శించారు.