: సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై శ్వేత పత్రం విడుదల చేయాలి : దేవీప్రసాద్
లక్షలాది మంది ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతున్నారని... అందుకే సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ ఎన్జీవో నేత దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రకటన వచ్చి ఇన్ని రోజులైనా... విభజనకు సంబంధించి ముందడుగు పడలేదని అన్నారు. కాబట్టి వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మిగిలిన రాష్ట్రాల్లో జరిగినట్టే ఇక్కడ కూడా ఉద్యోగుల విభజన జరుగుతుందని తెలిపారు. కేంద్ర ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఉద్యోగులకు వేతనాలు ఇప్పిస్తామని కేసీఆర్ అంటే... ఈ హక్కు మీకెక్కడిదని సీమాంధ్ర మంత్రులు ప్రశ్నించారని దుయ్యబట్టారు. సీమాంధ్ర ఉద్యమం వెనుక పెట్టుబడిదారులు ఉన్నారని అన్నారు. సీఎం కూడా వీరికి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు.