: ఈ నేరం క్షమించరానిది
బలవంతంగా వ్యభిచారం చేయించినందుకు ఓ మహిళకు పదేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో పాటు రూ. 10 వేలు జరిమానా విధించడం జరిగింది. తీర్పు ఇస్తున్న సమయంలో "ఈ నేరం క్షమించరానిదని" అడిషనల్ సెషన్స్ జడ్జి కావేరి బవేజా పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే... పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక బాలికను ఢిల్లీలోని జీబీ రోడ్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న పద్మకు ఇద్దరు యువకులు అమ్మేశారు. ఈ సంఘటన 2010లో జరిగింది. అమాయకురాలైన ఆ అమ్మాయిని వ్యభిచారం చేయాలని, పద్మ చిత్ర హింసలు పెట్టేది. ఒక రోజు తన దగ్గరకు వచ్చిన ఓ విటుడి ఫోన్ ద్వారా తన వివరాలను తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఈ దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు పద్మను అరెస్టు చేశారు. కేసును విచారించిన కోర్టు, అత్యంత దారుణంగా ఒక చిన్నారితో వ్యభిచారం చేయించిన పద్మకు పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. అంతేకాకుండా, మనుషుల అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించింది.