: ఉద్యమం ముసుగులో వెన్నుపోటు పొడవద్దు: పయ్యావుల
సమైక్యాంధ్ర ముసుగులో సీమాంధ్ర ప్రజలను వెన్నుపోటు పొడవొద్దని కాంగ్రెస్ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హితవు పలికారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీఎన్జీవోలు తమ జీతాలను సైతం త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అంశంపై పోరాడాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులపై ఉందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన కోసం వైఎస్సార్సీపీ అడుగడుగునా ఆరాటపడుతోందని ఆయన మండిపడ్డారు. చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టు సమైక్య ఉద్యమంలో వైఎస్సార్సీపీ చొరబడే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలే సమైక్య ఉద్యమకారులన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రపతి పాలన ద్వారా విభజనకు మార్గం సుగమం చేస్తే ప్రజలు క్షమించరని అన్నారు. రాష్ట్రంలో సమైక్యాంధ్ర చాంపియన్ లు కావాలని ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.