: కిరణ్ ఓ అజ్ఞాన మహాసముద్రం: కేటీఆర్
సమైక్యాంధ్రకు మద్దతుగా బలమైన గొంతుక వినిపిస్తున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు విరుచుకుపడ్డారు. హైదరాబాదు తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కిరణ్ ఓ అజ్ఞాన మహాసముద్రమని వ్యాఖ్యానించారు. నిన్న రాత్రి సీఎం మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగితే ఉత్పన్నమయ్యే సమస్యలను ఎత్తి చూపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కిరణ్ అవగాహన రాహిత్యంతో దాదాపు 70 నిమిషాల పాటు రెచ్చిపోయాడని విమర్శించారు. ఆయన వైఖరి చూస్తే.. 'తెలంగాణ ఎండాలి, సీమాంధ్ర పండాలి, నా పదవి ఉండాలి'.. అన్నట్టుందని దుయ్యబట్టారు.
రాష్ట్రం విడిపోతే జలవివాదాలు వస్తాయని, ఆ లెక్కన కృష్ణా, గోదావరి జలాల కోసం మూడు రాష్ట్రాలు కలిసుండాల్సిన పరిస్థితి ఉందని సీఎం అంటున్నారని.. ఆ విధంగా అయితే, దేశంలో జలవివాదాలు తలెత్తకుండా ఉండాలంటే రాష్ట్రాలే ఉండకూడదన్నది ఆయన అభిప్రాయంలా ఉందని వ్యాఖ్యానించారు. పాక్, బంగ్లాదేశ్ దేశాలు భారత్ తో పలు నదీ జలాలను పంచుకుంటున్నాయని, అలాగైతే వాటిని భారతదేశంలో కలిపేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ బాబు, కిరణ్ బాబుల మధ్య సీమాంధ్రలో ఆధిపత్య పోరు నడుస్తోందని, అందులో భాగంగానే సీఎం ఇలా అవగాహన లేకుండా మాట్లాడారని ఆయన మండిపడ్డారు.