: మూడు దశాబ్దాల తర్వాత..
మూడు దశాబ్దాల తర్వాత అమెరికా అధ్యక్షుడు ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు. ఈ అద్భుతమైన సంఘటన అమెరికా ప్రెసిడెంట్ ఒబామా, ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ మధ్య జరిగింది. 1979 తర్వాత ఇరు దేశాల అధ్యక్షులు మాట్లాడుకోవడం ఇదే ప్రథమం. పావుగంట పాటు జరిగిన ఈ సంభాషణలో ఇరాన్ కొత్త నాయకత్వం వల్ల అద్భుతమైన అభివృద్ధికి అవకాశాలున్నాయని ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంభాషణ ఒక మంచి ముందడుగవుతుందని ఒబామా అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారం వల్ల ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన విషయంలో కీలకమైన ఒప్పందాలు కుదిరే అవకాశాలను కొట్టిపారేయలేమని ఒబామా అన్నారు. అయితే, రానున్న రోజుల్లో జరిగే చర్చలు సఫలమవుతాయో? లేదో? చెప్పలేము కానీ... ఒక పరిష్కారమార్గాన్నయితే కచ్చితంగా కనుక్కుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.
అణ్వస్త్రాల గురించే ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సంభాషణ కొనసాగినట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరాలనేదే తమ అభిమతమని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ తెలిపారు. అణుబాంబులు తయారుచేయాలనే ఆలోచన తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చర్చలకు అనుకూలమైన వాతావరణం నెలకొందని ఆయనన్నారు.