: చవకగా లభించే చక్కటి ఔషధం అరటి!
అరటిపండు అన్ని కాలాల్లోను లభిస్తుంది. ఇతర ఫలాలతో పోల్చుకుంటే దీని ధర కూడా కాస్త తక్కువేనని చెప్పవచ్చు. ఇలాంటి అరటిపండును తీసుకోవడం వల్ల చక్కగా ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. సహజంగా అరటిపండులో పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇదేవిషయాన్ని అర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం అరటిపళ్లలో త్వరగా అరిగే గుణం ఉండే పీచు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. తద్వారా శరీరంలోని వ్యర్థపదార్ధాలు బయటికి పంపబడతాయి.
అరటిపండులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుందని సుమారు పదివేలమందిపై కొన్ని సంవత్సరాలపాటు జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. అరటిపండులో అధిక మోతాదులో ఉండే ట్రైప్టోఫాన్ ఉత్సాహాన్నిచ్చే సెరటోనిన్‌గా మారుతుంది. దీని ఫలితంగా మానసికంగా ఒత్తిళ్లు అదుపులో ఉంటాయి. అధిక బరువును అదుపులో ఉంచేందుకు, తెల్లరక్త కణాల తయారీకి కూడా అరటిపళ్లు ఉపయోగపడతాయి. వీటిలో ఉండే బి6 విటమిన్ దీనికి చక్కగా ఉపకరిస్తుంది. అలాగే రక్తహీనతను నివారించే ఐరన్ కూడా ఈ పండ్లలో తగుమోతాదులో ఉంటుంది. ఇక అరటిపండ్లు యాంటాసిడ్లుగా పనిచేసి కడుపులో అల్సర్, మంట వంటి వాటినుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇన్ని సుగుణాలున్న, అందుబాటులో ఉండే అరటిపండును రోజూ మన ఆహారంలో భాగం చేసుకుని మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.