: క్రోమోజోములు భిన్న ఆకారాల్లో ఉంటాయట!
సాధారణంగా క్రోమోజోములు ఎక్స్ ఆకారంలో ఉంటాయని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. అయితే క్రోమోజోములు నిజానికి ఎక్స్ ఆకారంలో ఉండవని భిన్నమైన ఆకారంలో ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలిసారిగా త్రీడీ క్రోమోజోము నమూనాలో ఈ విషయం వెల్లడైంది. కేవలం విడిపోయే సమయంలో కొద్దిసేపు మాత్రమే క్రోమోజోములు ఎక్స్ ఆకారంలో ఉంటాయని ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు.
క్రోమోజోముల రూపాన్ని చిత్రీకరించేందుకు శాస్త్రవేత్తలు ఉపయోగించిన త్రీడీ పద్ధతుల్లో క్రోమోజోముల అసలు ఆకారం బయటపడింది. గతంలో చెప్పినట్టుగా క్రోమోజోములు ఎక్స్ ఆకారంలో ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, వీజ్‌మన్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు కలిసి తొలిసారిగా క్రోమోజోముల త్రీడీ నమూనాలను చిత్రీకరించారు. ఈ త్రీడీ చిత్రాల్లో క్రోమోజోముల సంక్లిష్ట ఆకారం, వాటిల్లో ముడుచుకుని ఉండే డీఎన్ఏ రూపాన్ని స్పష్టంగా గుర్తించడం జరిగింది.
ఎక్స్ క్రోమోజోములు కణాల్లో విడిపోయే సమయంలో అది కూడా కొద్దిసేపు మాత్రమే ఎక్స్ ఆకారంలో ఉంటాయని బబ్రహామ్ ఇన్స్టిట్యూట్కు చెందిన డాక్టర్ పీటర్ ఫ్రేజర్ చెబుతున్నారు. క్రోమోజోములు నిజానికి భిన్నమైన ఆకారంలో ఉంటున్నట్టు, వాటి అసలు రూపాన్ని చిత్రించడం అసాధ్యంగా కనిపిస్తోందని పీటర్ చెబుతున్నారు. క్రోమోజోముల గురించి మరింత లోతుగా అధ్యయనం సాగించాల్సిన అవసరం ఉందని, దీనికి తాము కనుగొన్న విషయం చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్రోమోజోములు ఒకదానితో మరొకటి ఎలా చర్య జరుపుతాయి, జన్యువుల పనితీరును ఎలా నియంత్రిస్తాయి? అనే విషయాలను తెలుసుకోవడానికి కూడా తాము కనుగొన్న విషయాలు చక్కగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.