: అప్పుడు అక్కడ నీళ్లుండేవట!!


అంగారకుడిపై జరుపుతున్న అన్వేషణ ఎప్పటికప్పుడు కొత్త విషయాలను వెల్లడిస్తోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పంపిన రోవర్‌ అంగారకుడిపై జీవం ఉనికిని, అలాగే నీటి ఉనికిని గుర్తించడానికి చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర ఫలితాలనిస్తున్నాయి. అంగారకుడిపై జీవం ఉండే అవకాశాలు లేవని గతంలోనే రోవర్‌ ద్వారా తెలిసింది. అయితే నీటి జాడ మాత్రం ఇప్పటివరకూ తెలియరాలేదు. తాజాగా రోవర్‌ పర్యటిస్తున్న ప్రాంతంలో నీటి జాడను కనుగొనడం జరిగింది.

అంగారకుడిపై అమెరికా పంపిన రోవర్‌ క్యూరియాసిటీ అక్కడ తొలిసారిగా నీటికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించింది. రోవర్‌ సంచరిస్తున్న ఇసుకతో కూడిన రాక్‌నెస్ట్‌ అనే ప్రాంతంలోని మట్టికి సంబంధించిన నమూనాలను రోవర్‌కు చెందిన స్కూప్‌ద్వారా సేకరించి, దీన్ని శాంపిల్‌ అనాలసిస్‌ ఎట్‌ మార్స్‌ అనే పరికరంలోకి చొప్పించింది. ఈ పరికరం సదరు నమూనాలను విశ్లేషించడానికి అందులో గ్యాస్‌ క్రొమొటోగ్రాఫ్‌, మాస్‌ స్పెక్ట్రోమీటర్‌, ట్యూనబుల్‌ లేజర్‌ స్పెక్ట్రోమీటర్‌ వంటి పరికరాలున్నాయి. వీటి సాయంతో ఆ మట్టి నమూనాను విశ్లేషించగా అందులో కొంతమేర నీరు ఉన్నట్టు తేలింది.

ఈ విషయం గురించి లారీ లెషిన్‌ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ, అంగారకుడి ఉపరితల నమూనాలో దాదాపు 2 శాతంమేర నీరు ఉన్నట్టు తేలింది. ఇది శాస్త్రీయంగా ఆసక్తి కలిగించే అంశం అన్నారు. మట్టి నమూనాలను 835 డిగ్రీల సెల్సియస్‌కు వేడిచేయగా, అందులోనుండి గణనీయస్థాయిలో ఆక్సిజన్‌, కార్బన్‌డై ఆక్సైడ్‌, క్లోరిన్‌, క్లోరేట్‌, పెర్‌క్లోరేట్‌ వంటివి విడుదలయ్యాయి. ఇవి ఈ గ్రహం మొత్తం వ్యాపించి ఉన్నట్టు స్పష్టమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటి సమక్షంలో ఏర్పడే కార్బొనేట్‌ పదార్ధాలు కూడా ఆ మట్టిలో కనిపించినట్టు తేలింది. మొత్తానికి రోవర్‌ అంగారకుడిపై నీటి జాడను పసిగట్టింది. ఇక జీవం ఆనవాలును గుర్తించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News