: మూత్రపరీక్షతోనే వ్యాధి నిర్ధారణ!
మూత్ర పరీక్షతోనే వ్యాధి నిర్ధారణ దిశగా పలు పరిశోధనలు సాగుతున్నాయి. కేవలం మూత్ర పరీక్ష ద్వారా పలు రకాలైన క్యాన్సర్ వ్యాధులను గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. తాజాగా మూత్ర పరీక్ష ద్వారానే ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధిని కచ్చితంగా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధిని గుర్తించడానికి ఇప్పటి వరకూ ఉన్న ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటిజన్ (పీఎస్‌ఏ) అనే రక్త పరీక్ష ద్వారానే వ్యాధి నిర్ధారణ చేస్తారు. అంతటితో ఆగకుండా మళ్లీ జీవాణు పరీక్ష (బయాప్సీ) చేస్తేగానీ ఈ క్యాన్సర్ విషయంలో ఎలాంటి నిర్ధారణకు రాలేరు. అలాంటిది కేవలం మూత్ర పరీక్ష ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధిని కచ్చితంగా గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిచిగాన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ శాస్త్రవేత్తల్లో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా ఉన్నారు. ఈ కొత్త పరీక్షపేరు మి-ప్రొస్టేట్ స్కోర్, మిప్రో అని కూడా చెప్పవచ్చు. ఈ మిప్రో గతంలో జరిపే పీఎస్‌ఏ పరీక్షకంటే కూడా కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని, ఈ ఒక్క పరీక్షతోనే ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధి వచ్చే ప్రమాదముందా? లేదా ప్రస్తుతం శరీరం పరిస్థితి ఏంటి? వ్యాధి ఇంకా ముదిరే సూచనలు ఉన్నాయా? వంటి విషయాలపై వైద్యులకు స్పష్టత వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.