: రాహుల్ గాంధీపై ప్రతిపక్షాల దాడి
నేర చరితులను చట్ట సభల్లో కూర్చోబెట్టే ఆర్డినెన్స్ ను చెత్తబుట్టలో పడేయాలని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఇది ప్రభుత్వమా? లేక డ్రామా కంపెనీనా? అని విమర్శించాయి. ఇలాంటి డ్రామాలతో కాంగ్రెస్ పార్టీ తన వైఫల్యాలను దాచిపెట్టలేదని బీజీపీ నేత అబ్బాస్ నక్వీ ఘాటుగా స్పందించారు. విధిలేని పరిస్థితిలో నష్ట నివారణ చర్యలకు కాంగ్రెస్ సిద్ధమైందని రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ విమర్శించారు. ఈ ఆర్డినెన్స్ ను బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తోందని.. దీనిపై సంతకం చేయరాదని రాష్ట్రపతిని కూడా కోరిందని తెలిపారు. ఈ ఆర్డినెన్స్ విషయంలో కాంగ్రెస్ ను ప్రజలు ఛీకొడతారనే భయంతోనే రాహుల్ యూ టర్న్ తీసుకున్నారని జైట్లీ విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న సమన్వయ లోపం స్పష్టంగా అర్థమవుతోందని తృణమూల్ కాంగ్రెస్ నేత సౌగతరాయ్ ఎద్దేవాచేశారు.