: సచిన్, ధోనీలను అధిగమించనున్న కోహ్లి
సచిన్, ధోనీలను కోహ్లి అధిగమించనున్నాడా? ఔననే అంటున్నారు విశ్లేషకులు. అయితే సచిన్, ధోనీ నెలకొల్పిన రికార్డుల్లో కాదండి.... ఎండార్స్ మెంట్ల ద్వారా ఏడాదికి సంపాదించే మొత్తంలో. ఎందుకంటే ఇటీవలే ఏడాదికి రూ. 10 కోట్లకు ఒక జర్మన్ స్పోర్ట్స్ కంపెనీతో కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఈ ఒప్పందం కాలపరిమితి మూడేళ్లు. అంతే కాకుండా ఒక టైర్ల కంపెనీతో కూడా భారీ మొత్తానికి మరో అగ్రిమెంట్ చేసుకున్నాడట.
ప్రస్తుతం కోహ్లీ అన్ని ఫార్మాట్లలోనూ తనదైన శైలిలో ఆడుతూ భారీ స్కోర్లు చేస్తున్నాడు. థోనీ లేనప్పుడు టీం కెప్టెన్ గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నాడు. దీంతో క్రికెట్ అభిమానుల్లో కోహ్లీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అంతేకాకుండా కోహ్లీ గ్లామర్, హ్యాండ్సమ్ లుక్ యాడ్స్ కి బాగా సెట్ అవుతాయని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే అతన్ని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడం కోసం భారీ మొత్తాలు చెల్లించడానికైనా సరే ఓకే అంటున్నాయి.
పోయినేడాది బ్రాండ్ ఎండార్స్ మెంట్ల రూపంలో కోహ్లి దాదాపు రూ. 40 కోట్లు సంపాదించాడు. రానున్న కొత్త అగ్రిమెంట్లతో అతని ఆదాయం అమాంతం పెరగబోతోంది. ఇప్పటికే ఈ ఢిల్లీ డైనమైట్ 13 కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు. ఇదే విధంగా బ్రాండ్ ఇమేజ్ కొనసాగితే రానున్న కాలంలో ఎండార్స్ మెంట్ల పరంగా సచిన్, ధోనీలను కోహ్లీ అధిగమిస్తాడనడంలో సందేహంలేదు.