: ఇక్కడ నిజాయతీ ఎక్కువగా ఉంటుందట
నిజాయతీ అనేది కొరవడుతున్న నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహిస్తే... అత్యధికంగా నిజాయతీతో కూడుకున్న నగరంగా ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీ అగ్రస్థానంలో నిలువగా, భారతదేశంలో ఆర్ధిక రాజధానిగా పేరుపొందిన బొంబాయి రెండవ నిజాయతీ నగరంగా నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసుకున్న 16 నగరాల్లో నిజాయతీకి సంబంధించి ఒక ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో పరిశోధకులు ఆయా నగరాల్లో డబ్బులు, సెల్‌ఫోన్ నంబరు, కుటుంబ సభ్యుల ఫోటో, క్రెడిట్‌కార్డులు వగైరాలన్నీ ఉన్న పర్సులను పార్కులు, షాపింగ్‌మాల్స్, ఫుట్‌పాత్‌లు వంటి ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగానే జారవిడిచారు. తర్వాత పక్కనే ఉండి ఏం జరుగుతుందా? అని గమనించారు. ఇలా పడేసిన బ్యాగులు, పర్సులను తిరిగి ఆయా వ్యక్తులకు అందజేయడాన్ని బట్టి సంబంధింత నగరాల్లోని నిజాయతీని అంచనా వేశారు. ఈ నిజాయతీ జాబితాలో మనదేశంలోని ముంబై నగరం రెండవ స్థానంలో నిలిచింది. ఇక్కడ పడేసిన 12 పర్సుల్లో 9 పర్సులు కచ్చితంగా సొంతదారులను చేరాయి. అయితే హెల్సింకీలో అయితే 11 పర్సులు సొంతదారులకు చేరాయి. ఇలాంటి విశ్లేషణ ఆధారంగా సదరు నగరాలకు ర్యాంకులను ఇచ్చినట్టు అధ్యయనవేత్తలు తెలిపారు. ఈ ర్యాంకుల్లో పోర్చుగల్ రాజధాని లిస్బన్ మాత్రం అట్టడుగున నిలిచినట్టు పరిశోధకులు చెబుతున్నారు.