: చెట్టు ఒక్కటే... కాయలు రెండు రకాలు!
చెట్టు చూస్తే ఒక్కటే ఉంటుంది... కానీ దాని పంట మాత్రం రెండు రకాలుగా ఉంటుంది. ఇలా ఉంటే... ఇక ఈ రకమైన పంట వేసిన రైతుకు రెండు విధాలుగా లాభదాయకంగా ఉంటుంది కదూ... సరిగ్గా ఇలాంటి ఒక కొత్తరకం మొక్కను శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు. ఈ చెట్టునుండి ఇటు టమోటాలు, అటు బంగాళాదుంపలు రెండూ కూడా పండుతాయట.
బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక సరికొత్త రకం మొక్కను సృష్టించారు. ఈ మొక్కనుండి పైన టమాటాలు కాస్తాయి. అలాగే నేలలో ఎంచక్కా బంగాళాదుంపలు ఊరుతాయి. ఇలా రెండు రకాలైన కాపును ఈ మొక్క ఇస్తుంది. ఈ కొత్త మొక్కకు పెట్టిన పేరు కూడా చాలా వెరైటీగా ఉంది. దీనిపేరు టమ్‌టాటో (టమాటో+పొటాటో). ఈ కొత్త మొక్కను జన్యుమార్పిడి వంటి సాంకేతిక విధానం ద్వారా కాకుండా గ్రాఫ్టింగ్ అనే సహజమైన విధానం ద్వారా అభివృద్ధి చేయడం విశేషం. థామ్సన్ అండ్ మోర్గాన్ అనే సంస్థ ఈ కొత్త రకం మొక్కలను రూపొందించింది.
ఈ సంస్థ డైరెక్టర్ పాల్ హాన్సర్డ్ మాట్లాడుతూ టమాటాలు, బంగాళాదుంపలు మొక్కల కాండం దాదాపుగా ఒకే సైజులో ఉంటుంది. ఈ నేపధ్యంలో రెండిటినీ కలపడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అత్యంత నైపుణ్యంతో దీన్ని సాధించామని తెలిపారు. దాదాపుగా పదేళ్ల కృషి తర్వాత ఈ టమ్‌టాటోలను విజయవంతంగా ఉత్పత్తిచేయగలిగామని, గతంలో ఇటువంటి మొక్కలను సృష్టించడం సాధ్యమైనప్పటికీ వాటినుండి ఉత్పత్తి అయ్యే టమాటాలు, బంగాళాదుంపలు రుచిలేకుండా చప్పగా ఉండేవని, థామ్సన్ అండ్ మోర్గాన్ పరిశోధకులు ఈ సమస్యపై దృష్టి నిలిపి రెండింటి రుచి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా వీటిని ఉత్పత్తి చేసేవిధంగా మొక్కలను అభివృద్ధిచేశారని పాల్ తెలిపారు. వీటిని తొలిసారిగా వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పాల్ చెబుతున్నారు. త్వరలోనే ఈ టమ్‌టాటోలు మన దగ్గరికి రావచ్చన్నమాట.