: యూపీఏ భయపడుతోంది: అశోక్ బాబు
'కేబినెట్ నోట్ రెడీ అంటూ చెప్పిన యూపీఏ ప్రభుత్వం ఎంతకూ నోట్ బయటపెట్టడం లేదంటే దానికి కారణం ఇక్కడ జరుగుతున్న ఉద్యమమే' అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల తీరుతెన్నులపై రాజకీయనేతలు సమీక్షించుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు సమావేశాల్లో బిల్లు వస్తే అడ్డుకుంటాం, సమావేశాల తరువాత రాజీనామాలు చేసి ప్రజల్లోకి వస్తామని చెప్పిన కేంద్ర మంత్రులు కేబినెట్ నోట్ ను ఏ విధంగా అడ్డుకుంటారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రులు పార్లమెంటును వీడి రావాలని ఆయన సూచించారు. కేంద్ర మంత్రులు ఇప్పటికైనా తమకు లభించిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యోగులంతా 45 రోజులుగా, ప్రజలంతా 56 రోజులుగా సమ్మె చేస్తున్నామని గుర్తించాలని ఆయన కోరారు. శ్రీకాకుళం నుంచి సీమ వరకు ఉన్న ప్రజలకు రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలని అడిగారు.
రాష్ట్రంలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు అసెంబ్లీ అభిప్రాయం అడిగినప్పుడు సమైక్యతను చాటి చెప్పాలని ఆయన సూచించారు. ఇప్పటికిప్పుడు రాజీనామాలు చేయడం వల్ల ఉపయోగం లేదని తెలిపారు. ఈ సమయంలో ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్టీ రహితంగా అసెంబ్లీ తీర్మానం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు కూడా అసెంబ్లీ తీర్మానాన్ని గౌరవిస్తుందని అశోక్ బాబు తెలిపారు.
'మీ మీ పార్టీల పాలసీ ప్రకారం కాకుండా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల'న్నారు. దయచేసి రాజీనామాలను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. 'రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తున్నాం. రాజకీయ పార్టీలు స్పష్టంగా ప్రజల్లోకి వచ్చి రాష్ట్ర సమైక్యతకు పాటుపడాల'ని ఆశోక్ బాబు కోరారు.