: 'చావు' ఆటతో చావు నుంచి బయటపడ్డారు!
ఆస్కార్ అవార్డులు పొందిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా కథ మనలో చాలా మందికి గుర్తుండే వుంటుంది. నాజీల దురాగతాల నుంచి తన కొడుకును రక్షించుకోవడానికి యూదు పుస్తక యజమాని దాగుడుమూతల ఆట ఆడతాడు. నాజీల యుద్ధ శిబిరంలో జరుగుతున్న తతంగాన్ని కొడుకుకి దాగుడుమూతల ఆటగా నమ్మించి తానూ ఆడతాడు. చివరకు అమెరికన్లు నాజీల శిబిరాల్ని స్వాధీనం చేసుకోవడంతో తన కొడుకు ప్రాణాల్ని కాపాడుకుంటాడు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ... తాజాగా కెన్యాలోని నైరోబీలో జరిగిన మారణ హోమంలో ఓ తల్లి ఇదే తరహాలో తన పిల్లలతో చావు ఆట ఆడి కుటుంబాన్ని రక్షించుకుంది.
షాపింగ్ మాల్ లో కాల్పులు మొదలు కాగానే అప్రమత్తమైన తల్లి, తన పిల్లలిద్దరితో చావు ఆట ఆడదామని, ఏం జరిగినా తాను చెప్పేంత వరకు కదల కూడదని వాళ్లకు చెప్పింది. అలా చేయడం వల్ల ఆ ముష్కరుల బారి నుంచి బయటపడచ్చన్నది ఆ తల్లి ఆలోచన. తల్లి మాటల్ని తూచా తప్పకుండా పాటించిన పిల్లలు సైన్యం వచ్చే వరకు కదలకమెదలక పడుకున్నారు. దీంతో వాళ్ళను సైన్యం రక్షించగలిగింది. ఆ తల్లి అలా పిల్లలతో 'చావు' ఆట ఆడించి, చావు నుంచి తప్పించింది. ఈ మొత్తం తతంగాన్ని సీసీ కెమేరాలు చక్కగా బంధించాయి!