: కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్ లో నూకలు చెల్లిపోయాయి: కోడెల
కాంగ్రెస్ పార్టీపై టీడీపీ నేత కోడెల శివప్రసాద్ విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయని అన్నారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ఎల్లప్పుడూ దెబ్బతీస్తూనే ఉందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ను ఇప్పటికిప్పుడు విడదీయాల్సిన అవసరం ఆ పార్టీకి ఏమొచ్చిందని కోడెల ప్రశ్నించారు. తాజా పరిణామాలతో కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం నెలకొందని అన్నారు. అసలు, రాష్ట్ర విభజనపై ఆ పార్టీ వైఖరేంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ తో తెలంగాణలో.. వైఎస్సార్సీపీతో సీమాంధ్రలో అంటకాగేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనమవుతుందని, జగన్ డీఎన్ఎ తమ డీఎన్ఏ ఒకటే అని దిగ్విజయ్ మాట్లాడిన విషయాన్ని కోడెల ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు మాట మారుస్తోందని మండిపడ్డారు. వారికి ఇతరులను విమర్శించే హక్కు లేదని స్పష్టం చేశారు. జగన్ అవినీతి పరుడా? కాదా? అని అడిగితే వైఎస్సార్సీపీ నేతలు బదులివ్వడంలేదని అన్నారు.