: అంచనాలకు మించి పెరుగుతున్న సముద్ర మట్టం
వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు జీవుల మనుగడకు పెను ముప్పుగా మారాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రత మానవాళి మనుగడకు శాపంగా పరిణమించింది. వేడిమికి ధృవ ప్రాంతాల్లో మంచు భారీగా కరుగుతుండటంతో సముద్ర మట్టాలు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ వివరాలను వాతావరణ మార్పుపై అంతర్జాతీయ కమిటీ (ఐపీసీసీ) వెల్లడించింది. ఈ కమిటీ వాతావరణంలో చోటుచేసుకునే మార్పులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నివేదికలు సమర్పిస్తుంటుంది. 2100 నాటికి సముద్ర మట్టం 26 నుంచి 81 సెంటీమీటర్ల వరకు పెరగనుందని ఐపీసీసీ తాజాగా అంచనా వేసింది. 2007లో ఈ కమిటీ సమర్పించిన నివేదికలో ఈ పెరుగుదల 18 నుంచి 59 సెంటీమీటర్లు మాత్రమే. అప్పట్లో ఈ నివేదికకు నోబెల్ పురస్కారం కూడా దక్కింది. ప్రస్తుత అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో కోస్తా తీర ప్రాంతాలకు అనుకున్న దానికంటే ఎక్కువ ముప్పు కలగనుందని ఐపీసీసీ హెచ్చరించింది.