: ఇంట్లోని కీటకాలకు చెక్ చెప్పవచ్చు!
ఇళ్లలో ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా కూడా చిన్న చిన్న కీటకాలు ఇష్టారాజ్యంగా తిరుగుతుంటాయి. ఎన్ని రకాలైన కీటక నాశనులను వాడినా కూడా వాటి జనాభా విపరీతంగా పెరిగిపోతుంటుంది. దీంతో ఇంట్లో మనకన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే వీటినుండి ఆహారపదార్ధాలను రక్షించుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. ఇలాంటి ఇబ్బందులకు ఇకపై చెక్ పెట్టడానికి శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్ఛగా తిరిగే బొద్దింకలు, చీమలు, ఇతర చిన్న చిన్న కీటకాలను కట్టడి చేయడానికి ఉపకరించే పలుచటి కృత్రిమ ఉపరితలాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ ఉపరితలంపై నుండి ఇంట్లోకి కీటకాలు ప్రవేశం నిషేధించబడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనం రోజూ ఉపయోగించుకునే మిక్సీ, ఎయిర్ కండిషనర్ చివరికి ఫ్రిజ్ లోపలికి కూడా వెళ్లిపోయే ఈ చిన్న చిన్న కీటకాలను శాస్త్రవేత్తలు రూపొందించిన కృత్రిమ ఉపరితలాలు దూరంగా ఉంచుతాయట. ఇంట్లోని అవసరాలకు అనుగుణమైన రీతిలో ఈ ఉపరితలాలను వాడడం ద్వారా క్రిమికీటకాలను దూరంగా ఉంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పలుచగా ఉంటూ గాజుకంటే కూడా జారుడు స్వభావాన్ని కలిగివుండే ఈ కృత్రిమ ఉపరితలాలు జిగురు పదార్ధంతో నిమిత్తం లేకుండా కీటకాలను వెళ్లగొట్టగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే సహజంగా ఉండే ఉపరితలంపై చీమలు, ఇతర కీటకాలు చక్కగా పరుగులు తీయగలవు. కానీ జారుడు స్వభావం ఉండే ఉపరితలంపై వాటి తిరుగుడు కష్టమవుతుంది. దీంతో కీటకాలకు మన ఇంట్లో నో ఎంట్రీ. ఈ ఉపరితలాలను ఎయిర్ కండిషనర్ వెంటిలేషన్ పైపులపై వాడితే మంచి ఫలితాలు ఉంటాయని, ఇలాంటి వాటిపై కాలు పెట్టడమే కీటకాలకు అసాధ్యమైపోతుందని, వాటిపై ఇలా కాలు పెట్టగానే జర్రున జారిపోతుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలాంటి ఉపరితలాన్ని రూపొందించడానికి శాస్త్రవేత్తలు బొద్దింకలు, ఇతర క్రిమి కీటకాల మనుగడను పరిశీలించారు, ఇందుకోసం వారు ఎంతగానో శ్రమించాల్సి వచ్చిందట. వివిధ ఉపరితలాలపై వాటి స్పందన ఎలా ఉంటుంది? అనే విషయాన్ని పరిశీలించి ఇలాంటి కృత్రిమ ఉపరితలాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు.