: అందువల్లే తీపిపై మక్కువ ఎక్కువట
కొందరికి తీపి వస్తువులంటే చాలా ఇష్టం. మరికొందరు సహజంగానే స్వీట్స్‌ని పెద్దగా ఇష్టపడరు. అయితే స్వీట్స్ తయారీలో చక్కెరకు బదులుగా కృత్రిమ మధురాలను వాడడం వల్ల సహజంగానే స్వీట్స్‌పై మక్కువ ఎక్కువవుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. కొద్దిరోజుల పాటు కృత్రిమ మధురాలను వాడిన తర్వాత శరీరం సహజ మధురాలను కోరుకుంటుందని ఈ అధ్యయనంలో నిపుణులు తేల్చారు.
అమెరికాలోని యాలే విశ్వవిద్యాలయ కళాశాల ప్రొఫెసర్ ఇవాన్ డి అరౌజో నేతృత్వంలో సాగిన ఒక అధ్యయనంలో కృత్రిమ మధురాలను తినేటప్పుడుకంటే సహజమైన తీపి పదార్ధాలను తిన్నప్పుడు మెదడు అధికంగా స్పందిస్తుందని తేలింది. వీరు తమ అధ్యయనంలో భాగంగా చిట్టెలుకలపై పరిశోధించారు. తీపి పదార్ధాలను, కృత్రిమ మధుర పదార్ధాలను తినిపించినప్పుడు వాటి మెదడులోని రసాయన ప్రతిస్పందనలను గుర్తించారు. కొన్నాళ్లపాటు కృత్రిమ మధురాలను వినియోగించిన తర్వాత శరీరం సహజ మధురాలను కోరుకుంటుందని వీరి అధ్యయనంలో తేలింది.