: హిట్ లిస్టులో నా పేరున్నా జంగల్ మహల్ లో పర్యటిస్తా: మమత
తన పేరు మావోయిస్టుల హిట్ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నా కూడా తాను భయపడనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని సిల్డాలో జరిగిన బహిరంగ సభలో మమత ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ, మావోయిస్టుల కంచుకోటలాంటి జంగల్ మహల్ లో పర్యటిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. 'నాపేరు వారి హిట్ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిసింది. వాళ్లకు ధైర్యముంటే రమ్మనండి. నాకు వాళ్లంటే భయం లేదు. జంగల్ మహల్ లో పర్యటించకుండా నన్నెవరూ ఆపలేరు' అని మమతా సవాలు విసిరారు. పిరికి వాళ్లలా రాత్రివేళల్లో చంపే మావోలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో 2010లో మరణించిన 24 మంది తూర్పు సరిహద్దు రైఫిల్స్ దళ సభ్యుల గౌరవార్థం స్మారక చిహ్నం నిర్మిస్తామని ఆమె తెలిపారు.