: ముంబైలో 11 చోట్ల తీవ్రవాదుల రెక్కీ
కొన్నాళ్ళ క్రితం ముంబైలో పాక్ తీవ్రవాదులు జరిపిన నరమేధం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. కానీ, ఇంతలోనే తీవ్రవాదులు ముంబైలో మరోమారు దాడికి రెడీ అయ్యారన్న వార్త దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మరో భీకర దాడి జరపడానికి ముంబై మహానగరంలో 11 చోట్ల ఇండియన్ ముజాహిదీన్ రెక్కీ నిర్వహించిందని.. ఇటీవలే అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ వెల్లడించాడు. దీంతో ముంబైలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ఏటీఎస్ ఛీఫ్ రాకేష్ మారియా సంతకం చేసిన రహస్య నివేదికలోని వివరాలు వెల్లడయ్యాయి. ఆగస్టులో 11 ప్రాంతాల్లో వీరు రెక్కీ నిర్వహించినట్టు ఆ నివేదికలో ఉంది. భత్కల్ తో పాటు అతడి సహచరుడు అసదుల్లా అఖ్తర్ ను నిఘా సంస్థలు విచారించినప్పుడు ఈ వివరాలు వెల్లడించారు.
ముంబైలోని పోలీస్ కమిషనరేట్, ముంబాదేవి ఆలయం, ముంబై సెంట్రల్ బస్ డిపో, ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, జవేరీ బజార్, కల్బాదేవి, మంగళ్ దాస్ మార్కెట్, లోహార్ చాల్, క్రాఫోర్డ్ మార్కెట్, ఏటీఎస్ ప్రధాన కార్యాలయం పక్కనున్న మాగెన్ డేవిడ్ సైనేజి తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టు వీరు తెలిపారు.