: యూపీఏకు ఎన్డీఏతో పోలికా? : అద్వానీ
అవినీతితో కళంకితమైన యూపీఏకు ఎన్డీఏతో పోలికేమిటని అద్వానీ ప్రశ్నించారు. కలలో కూడా ఎన్డీఏతో పోల్చుకోకండని యూపీఏకు హితవు పలికారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగిన శాసనసభ ఎన్నికల బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. పని తీరుతోనే తాము అధికారంలోకి వస్తామని తెలిపారు. చేసిన మంచి పనుల వల్లే... తాము యూపీఏ కంటే మెరుగైన స్థితిలో ఉన్నామని అన్నారు. దేశంలో మరే ఇతర పార్టీకి బీజేపీతో పోల్చుకునే పరిస్థితి లేదని అద్వానీ తెలిపారు. ఈ సభకు జీజేపీ అగ్రనాయకులు చాలా మంది హాజరయ్యారు. దీని గురించి మాట్లాడుతూ... తమ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో పాటు చాలా మంది అగ్రనాయకులు వేదికను పంచుకున్నారని తెలిపారు. ఇది తమ ఐక్యతను, బలాన్ని ప్రపంచం మొత్తానికి చూపెడుతుందని అన్నారు. ఈ సభకు అద్వానీ, మోడీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, ఉమా భారతి, వెంకయ్య నాయుడు హాజరయ్యారు.