: జగన్ కు ఆనం సపోర్ట్
అక్రమాస్తుల కేసులో బెయిల్ పై విడుదలైన వైఎస్ జగన్ కు కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు లభిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కూడా జగన్ కు అనుకూలంగా మాట్లాడారు. నెల్లూరు వీఆర్ కాలేజీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన అభిప్రాయాలు వెల్లడించారు. జగన్ పై లేనిపోనివి ప్రచారం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు తగదని హితవు పలికారు. కాంగ్రెస్ తో వైఎస్సార్సీపీ లాలూచీ పడడం వల్లే జగన్ కు బెయిల్ అని బాబు చేసిన ఆరోపణలను వివేకా ఖండించారు. బెయిల్ పై బయటికొచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, జగన్ కూడా అలానే బయటికొచ్చాడని వివరించారు.
దివంగత ఎర్రన్నాయుడు, మాజీమంత్రి శంకర్రావు వేసిన పిటిషన్లపైనే జగన్ 16 నెలలు జైలులో గడిపారని, అతడు నిర్దోషి అని తేలితే ఆ పదహారు నెలల కాలాన్ని మీరు జైలులో గడుపుతారా? అని వివేకా సూటిగా బాబును ప్రశ్నించారు. గతంలో సీబీఐ, న్యాయవ్యవస్థలపై ప్రశంసలు కురిపించిన బాబు ఇప్పుడు వాటిని తప్పుబట్టడం సరికాదన్నారు.