లోక్ సభలో ఆర్ధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో టీడీపీ నేత యనమల రామకృష్ణ స్పందించారు. ముందు కలలు సృష్టించి తరువాత కోతలు విధించడం యూపీఏకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. 2012-13 లో ప్రణాళిక వ్యయం మీద రూ.93 వేల కోట్ల కోత విధించారన్న యనమల, దీనివల్ల వ్యవసాయ, సంక్షేమ రంగాలను బలి చేశారని ఆగ్రహించారు.
అయితే, ప్రత్యక్షం
గా పన్నులు మోపకపోయినా.. పరోక్షంగా పన్నులు భారీగా పెంచారన్నారు. వేల కోట్ల భారం ప్రజలపై మోపినా ద్రవ్యలోటు పూడ్చలేని అసమర్ధత యూపీయే సర్కారుదేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల దృష్ట్యా కేటాయింపులు అధికంగా చూపినా, వెనుక కోతలు విధించడం చిదంబర రహస్యమేనని చురక వేశారు. ప్రణాళికా వ్యయం రూ.30 వేల కోట్లు మాత్రమే పెంచారన్నారు. ఇందువల్ల అనుత్పాదక వ్యయం పెరుగుతుందని ఆయన చెప్పారు. తాజా కేంద్ర బడ్జెట్ వల్ల ఆర్ధిక పరిస్థితి మరింతగా అగాధంలోకి పోతుందని యనమల ఆవేదన వ్యక్తం చేశారు.