: 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని అడ్డుకుంటాం: ఓయూ జేఏసీ
మెగా హీరోలకు కాలం ఏ మాత్రం కలసి రావట్లేదు. రాష్ట్ర విభజన ప్రకటనతో నెలకొన్న ఆందోళనలతో... ఇరు ప్రాంతాల్లోనూ వీరి సినిమాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ నెల 27న విడుదల కానున్న పవన్ కల్యాణ్ తాజా చిత్రం 'అత్తారింటికి దారేది'ని అడ్డుకుంటామని ఓయూ జేఏసీ హెచ్చరించింది. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రి చిరంజీవి అడ్డుపడుతున్నందుకే ఈ నిర్ణయానికి వచ్చామని తెలిపింది. జేఏసీ నేతలు రాజు, రవి, నెహ్రూనాయక్ లు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. మొదట సామాజిక న్యాయమంటూ మాట్లాడిన చిరంజీవి, తర్వాత మాట మార్చి 1500 మంది తెలంగాణ విద్యార్థుల మరణానికి కారణమయ్యారని ఆరోపించారు. తెలంగాణలో పవన్ సినిమాను ప్రదర్శించవద్దని థియేటర్ల యజమానులకు జేఏసీ నేతలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఈ సినిమాను కొనవద్దని హెచ్చరించారు.