: పెళ్లి చేసుకుంటే క్యాన్సర్ ముప్పు తక్కువేనట!
అదేంటి, పెళ్లి చేసుకుంటే క్యాన్సర్ ఎలా దూరమవుతుంది? అనుకుంటున్నారా... వివాహితులు క్యాన్సర్ వ్యాధిని తట్టుకుని నిలబడగలిగే అవకాశం ఎక్కువని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే పెళ్లికాని వారికన్నా వివాహితులే క్యాన్సర్ వ్యాధి సోకినా కుంగిపోకుండా తట్టుకుని నిలబడగలిగారని వారి పరిశోధనలో తేలింది. బ్రహ్మచారులతో పోల్చుకుంటే వివాహితులు క్యాన్సర్ వ్యాధి సోకినా కూడా తట్టుకుని ఎక్కువ కాలం జీవించగలిగారని వీరి అధ్యయనంలో తేలింది.
వివాహితులు క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించే అవకాశం ఉందట. ఈ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా దాన్ని నయం చేయడానికి వీలవుతుంది. ఈ విషయం గురించి హార్వర్డ్ రేడియేషన్ అంకాలజీ శాస్త్రవేత్త అయాల్ ఐజర్ మాట్లాడుతూ, పెళ్లి అనేది క్యాన్సర్ రోగులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నట్టు తమ అధ్యయనంలో తేలిందని, అన్ని రకాలైన క్యాన్సరు వ్యాధుల్లోను ఇదే ఫలితం కనిపించిందని తెలిపారు. దీనికి జీవిత భాగస్వామి నుండి లభించే సామాజిక మద్దతు కూడా కీలక పాత్ర పోషించివుండవచ్చని ఆయన చెబుతున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించడానికి వీరు 2004 నుండి 2008 మధ్య 7,34,889 మంది క్యాన్సర్ రోగులపై అధ్యయనం జరిపారు. ఈ అధ్యయనంలో వివాహిత రోగులతో పోలిస్తే అవివాహిత రోగులు, తమ జీవిత భాగస్వామి అప్పటికే మరణించిన వారిలో మెటాస్టాటిక్ క్యాన్సర్ (ప్రారంభమైన ప్రాంతం నుండి ఇతర అవయవాలకు వ్యాపించే క్యానర్)కు గురయ్యే ముప్పు 17 శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలింది. అలాగే సరైన చికిత్స పొందే అవకాశం కూడా వీరిలో 53శాతం తక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో గుర్తించారు.