: జగన్ తో ఒప్పందం కోసం రాష్ట్రాన్ని బలి చేస్తారా?: ఎమ్మెల్యే తోట
కేసీఆర్ , జగన్ తో మీ ఒప్పందానికి రాష్ట్రాన్ని బలి చేస్తారా? అని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సూటిగా ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల చరిత్ర హీనులుగా మారాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పార్టీ అవసరాల కోసం చారిత్రక నిర్ణయాలు తీసుకోకూడదని అధిష్ఠానానికి హితవు పలికారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా నడచుకోవాలని ఆయన సూచించారు. లక్ష కోట్లు తిన్న జగన్, బయటకు రాడనుకున్న జగన్, ఎలా బయటికి వచ్చాడో చెప్పాలని కేంద్రాన్ని నిలదీశారు. జగన్ పై దాదాపు 26 కేసులుండగా చార్జిషీట్లు 10 కే ఎలా పరిమితం చేశారని అడిగారు. జగన్ విషయంలో అనుమానించిందే జరిగిందని, ప్రజలకు ఏ సందేశమిస్తున్నామో తెలుసుకోకుండా కేంద్రం వ్యవహరించిందని మండిపడ్డారు.
'ఎక్కడో ఢిల్లీలో ఉండి గొప్ప రాజకీయం చేస్తున్నామనుకుంటున్నారు కానీ, ఢిల్లీ పెద్దల ఆలోచనలు పొలం గట్టున ఉన్న రైతు కూడా ముందే చెప్పేస్తున్నాడు'అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, జగన్ పార్టీలతో ఒప్పందం చేసుకున్న పార్టీకి ప్రజలకు గట్టిగా బుద్ధి చెబుతారని త్రిమూర్తులు అభిప్రాయపడ్డారు.