: సోనియా కళ్లు తెరవాలి: పరిటాల సునీత
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పటికైనా కళ్లు తెరిచి చూసి వాస్తవాలు తెలుసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఆందోళనలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. 5 లక్షల మంది ప్రజలు స్వచ్చందంగా రోడ్లమీదికి రావడం చూస్తుంటే.. ప్రజల్లో ఉన్న అసంతృప్తి అర్థమవుతోందని అన్నారు. సమైక్య ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారని తెలిపారు. ఎప్పుడూ ఇళ్లలో ఉండే గృహిణులు, పండు ముసలివారితో సహా అన్ని రంగాలకు చెందిన ప్రజలు రోడ్లపైకెక్కాల్సిన పరిస్థితి సోనియా తీసుకొచ్చారని ఆమె మండిపడ్డారు.
ఇప్పడు ఢిల్లీలో కూర్చుని ఎంపీలు రాజీనామా నాటకాలాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులో మాట, వారి భార్యలొక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 'రండి అందరం కలిసి పార్టీలకతీతంగా పోరాడదాం.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుదాం' అంటూ ఆమె పిలుపునిచ్చారు. కనీసం నీటి సదుపాయం కూడా కల్పించకపోయినా లక్షలాది ప్రజలు రోడ్ల మీదికి వచ్చి సంఘటితంగా పోరాడుతున్నారని, ఉద్యోగుల త్యాగం చిరస్మరణీయమని పరిటాల సునీత అభినందించారు.