: ముంజేతి చర్మం ముందే చెబుతుంది


మనకు ఏవైనా గుండె జబ్బులున్నాయా... అనే విషయం తెలుసుకోవాలంటే వివిధరకాలైన పరీక్షలను చేయించుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా మీ ముంజేయి మీ గుండెకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తే... ఇలాంటి ఒక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. మన ముంజేతి చర్మంపై కాంతిని ప్రసరింపజేసే ఒక ప్రత్యేకమైన పరికరంతో గుండెజబ్బుల ముప్పును ముందుగానే పసిగట్టవచ్చని చెబుతున్నారు.

ముఖ్యంగా షుగరు వ్యాధి ఉండేవారికి గుండెజబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి రాబోయే ముప్పును ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి ఈ సరికొత్త పరిజ్ఞానం చక్కగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముంజేతిపై కాంతిని ప్రసరింపజేసే ఏజీఈ రీడర్‌ అనే పరీక్ష ద్వారా షుగరు వ్యాధిగ్రస్థులకు భవిష్యత్తులో గుండెజబ్బులకు సంబంధించిన ముప్పును ముందుగానే పసిగట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రీడర్‌ని ఇప్పటికే అమెరికా, యూరప్‌ దేశాల్లో వినియోగిస్తున్నారని, ఖతార్‌లోని వీల్‌ కార్నెల్‌ వైద్య కళాశాల పరిశోధకులు చెబుతున్నారు. అలాగే లేత చర్మంగలవారికి మాత్రమే కాకుండా ముదురు చర్మంగల దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజలకు కూడా ఇది చక్కగా ఉపయోగపడగలదనే విషయం తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా మన శరీరంలోని కణజాలంలో చక్కెరతో కూడిన ప్రోటీన్లు పోగుపడుతుంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ అవి క్షీణిస్తుంటాయి. అతి సూక్ష్మమైన తునకల మాదిరిగా ఉండే వీటిని అడ్వాన్స్‌డ్‌ గ్లెకేషన్‌ ఎండ్‌ (ఏజీఈ) పదార్ధాలు అంటారు. వీటిపై కాంతిని ప్రసరింపజేసి వాటినుండి పరావర్తనం చెందే వెలుగు ఆధారంగా గుండెజబ్బు ముప్పును పసిగట్టడమే ఈ రీడర్‌ చేసే పని. మన ముంజేతిని దీనిపై పెట్టగానే అందులోనుండి కాంతి వెలువడుతుంది. ఈ కాంతి అక్కడి కణజాలంలోని ఏజీఈలపై పడ్డప్పుడు అవి వెలుగుతాయి, వాటితోబాటు ఇతర ప్రోటీన్లు, కొవ్వులు కూడా వివిధ రంగుల్లో కాంతిని పరావర్తనం చేస్తాయి. ఈ రంగులను స్పెక్ట్రోమీటర్‌ సాయంతో గ్రహించి, వాటిని విశ్లేషించి, ఏజీఈలు, కొవ్వు కణాల మోతాదునుబట్టి గుండెజబ్బు ముప్పు ఏ మేరకు ఉందో అప్పటికప్పుడు అంచనావేసి చెప్పవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News