: కొత్త కళ్లొస్తున్నాయి...
మన కళ్లు కొంత విస్తృతి మేర మాత్రమే చూడగలవు. కీటకాల కళ్లు చాలా ఎక్కువ విస్తృతిని కలిగివుంటాయి. ఈ రెండింటి దృష్టి విస్తృతిని కలిగిన కన్ను ఉంటే... అప్పుడు మన చూపు పరిధి చాలా ఎక్కువగా ఉండడమేకాదు... మనం అవసరాన్ని బట్టి మన దృష్టి కేంద్రీకరణను కూడా మార్చుకోగలం. ఇలాంటి ఒక సరికొత్త కటకాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ కటకం మనిషి దృష్టి పరిధితోబాటు, కీటకాల దృష్టి పరిధి కూడా చూడగల సామర్ధ్యాన్ని కలిగివుంటుంది.
కీటకాల దృష్టి విస్తృతి చాలా విశాలంగా ఉంటుంది. అలాగే మనిషి కన్ను తన కేంద్రీకరణను మార్చుకోగలదు. కానీ కీటకాలు తమ దృష్టి కేంద్రీకరణను మార్చుకోలేవు. ఈ రెండింటి లక్షణాలను కలగలిపివున్న ఒక కొత్త తరహా కటకాన్ని శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. ఈ కటకం కీటకానికి ఉన్న దృష్టి విస్తృతితోబాటు మనిషి కంటికున్న స్పష్టమైన గోచరత, దృష్టి కేంద్రీకరణను మార్చుకోగలిగిన శక్తిని కూడా కలిగివుంటుంది. ఓహియో స్టేట్ యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఆప్తాల్మాలజీ విభాగం ప్రొఫెసర్ ఈ సరికొత్త కటకం గురించి మాట్లాడుతూ కంటిలో ఉండే ద్రవాలను పోలిన పారదర్శక ద్రవాలను ఉపయోగించి ఈ కటకాన్ని స్పష్టమైన విస్తృత దృష్టి ఉండేలా తయారుచేయనున్నట్టు తెలిపారు. ద్రవపదార్థం ఉపయోగించడం వల్ల ఈ కటకం ఆకారాన్ని కూడా మార్చుకోవచ్చని, లాప్రోస్కోపీలో ఇప్పుడు ఉపయోగిస్తున్న కెమెరాలకు బదులుగా ఈ కటకం ఉన్న కెమెరాలను ఉపయోగిస్తే పరిశీలించాల్సిన కణాలు, శస్త్రచికిత్స చేయాల్సిన భాగాలను మరింత కచ్చితంగా గుర్తించవచ్చని చెబుతున్నారు.