: ఈ రోజే పండుగ రోజు: జగన్ బెయిల్ పై విజయమ్మ స్పందన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డికి బెయిల్ వచ్చిన ఈరోజే పండుగ రోజని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, జగన్ తల్లి విజయమ్మ అన్నారు. లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో ఈ సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, తమకు అండగా నిలిచిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అందరి ఆశీర్వాదాలు జగన్కు కావాలని కోరారు. దేవుడు గొప్ప దేవుడని, 16 నెలల నుంచి జైలులో ఉన్న జగన్కు బెయిల్ వచ్చిందన్నారు. జగన్ బెయిల్పై బయటకు వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత జగన్ ప్రజల పక్షాన నిలబడి పోరాడినట్లు ఆమె అన్నారు.
నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ సాయంత్రం జగన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు బెయిల్ రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆనందంగా ఉన్నారు. హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.