: 10 లక్షల మందితో హైదరాబాదును ముట్టడిస్తాం: అశోక్ బాబు
అవసరమైతే 10 లక్షల మందితో హైదరాబాదును ముట్టడిస్తామని అశోక్ బాబు హెచ్చరించారు. అనంతపురం జిల్లా హిందూ పురంలో 'లేపాక్షి బసవన్న రంకె' సభలో మాట్లాడుతూ.. తలవంచి ఉన్నాం కనుక మౌనంగా అన్నీ భరిస్తున్నామని, మేం కనుక తల ఎగురవేసిన రోజున ఏ శక్తీ తమను ఆపలేదని అన్నారు. తెలంగాణ నేతలు ఇప్పటికైనా అవాకులు చవాకులు పేలడం మానాలని ఆయన సూచించారు. తెలంగాణలో అదిలాబాద్ తప్ప వెనుకబడిన జిల్లాలు లేవని ఆయన స్పష్టం చేశారు. శాంతియుత ఉద్యమాన్ని చేతకాని ఉద్యమంగా తీసుకోవద్దని అశోక్ బాబు హెచ్చరించారు. ఉద్యమంలోకి రాకపోతే నేతలకు శుభం కార్డేనని ఆయన తెలిపారు.
రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని హామీ ఇస్తేనే తప్ప ఉద్యమానికి ముగింపులేదని ఆయన అన్నారు. తనను 30 రోజుల నాయకుడంటూ అవహేళన చేస్తున్నారని, తాను ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తాను లేకున్నా ఉద్యమం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు నెల రోజులు స్కూలు మానేసినంత మాత్రాన జీవితాలు పోవని, విద్యార్థుల సామాజిక బాధ్యతను తల్లిదండ్రులు గుర్తించి వారికి చరిత్ర తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.