: జగన్ కు లైన్ క్లియర్ అయినట్లేనా?
గత ఏడాదిన్నరగా అక్రమాస్తుల కేసులో చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లైన్ క్లియర్ అయ్యిందా?. సాక్షాత్తూ సీబీఐ.. జగన్ కంపెనీల్లో క్విడ్ ప్రో-కో కు ఆధారాలు లేవని పేర్కోవడంతో జగన్ విడుదలకు, లేదా బెయిలుకు మార్గం సుగమం అయినట్లేనా? అన్న ప్రశ్నకు అవుననే విశ్లేషకులు సమాధానం ఇస్తున్నారు. ఇన్నాళ్లు జగన్ దోషి అని, బయటకు వెళితే సాక్షులను బెదిరించి కేసును తప్పుదారి పట్టించే అవకాశం ఉందని వాదించిన సీబీఐ, హైకోర్టు దర్యాప్తుకు ఆదేశించిన అంశాల్లో తప్పు జరిగిందనడానికి ఆధారాలు లేవని చెప్పడంతో జగన్ విడుదలకు రంగం సిద్ధమైందని అంటున్నారు.
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం జగన్ కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరు పట్ల సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఒకవేళ ఆయనకు బెయిల్ వస్తే, రాష్ట్ర విభజన కుట్రలో భాగంగానే బెయిల్ ఇచ్చారని భావించాల్సి ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ తో కుమ్మక్కై టీడీపీని నామరూపాల్లేకుండా చేసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్రలో జగన్ పార్టీతో అంటకాగి టీడీపీని ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసిందని, అందులో భాగంగానే జగన్ ను విడుదల చేసేందుకు పావులు కదిపిందని వారు ఆరోపిస్తున్నారు.