: నోట్ పూర్తయినంత మాత్రాన రాష్ట్రం విడిపోయినట్టు కాదు: అశోక్ బాబు
కేబినెట్ నోట్ పూర్తయినంత మాత్రాన రాష్ట్రం విడిపోయినట్టు భావించరాదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యానించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేబినెట్ నోట్ ను తిరస్కరించి సీమాంధ్ర కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠ కోల్పోయిందని అన్నారు. రాజకీయ పార్టీలు తీసుకున్న నిర్ణయం ప్రజల నిర్ణయం కాబోదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనను సమర్థించేవారికి భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు.విభజన చేయబోమని ప్రకటన చేసేవరకు సమ్మెను విరమించేదిలేదని తేల్చి చెప్పారు. రైతులు కూడా ఉద్యమంలోకి వస్తే తీవ్రత మరింత పెరుగుతుందని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు.