: అసాంఘిక శక్తులను తిప్పికొట్టాలి : ప్రధాని
దేశంలోని అసాంఘిక శక్తుల యత్నాలను తిప్పికొట్టాలని ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. ఈ రోజు ఢిల్లీలో జరిగిన జాతీయ సమగ్రతా మండలి భేటీలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. చిన్న చిన్న సంఘటనలే పెద్ద అల్లర్లకు కారణమవుతున్నాయని ఆయన తెలిపారు. వాటిని ఆసరాగా చేసుకొని ముష్కరమూకలు అల్లర్లను సృష్టిస్తున్నాయని అన్నారు. 50 మందికి పైగా అమాయకులను బలిగొన్న ముజఫర్ నగర్ ఘటన అమానుషమని ఆవేదన వ్యక్తపరిచారు. మత సామరస్యం కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని చెప్పారు. మత కల్లోలాలను అరికట్టడానికి అందరూ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఏడాదికాలంలో హైదరాబాద్, కిష్త్వాడ్, ఉత్తరప్రదేశ్ లలో ఉద్రిక్తతలు తలెత్తాయని ప్రధాని చెప్పారు. మతపరమైన ఘర్షణలను రాజకీయం చేయరాదని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు కొత్త చట్టాలను తీసుకురానున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, హోం మంత్రి షిండేతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ తో పాటు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ సమావేశానికి హాజరయ్యారు. అయితే గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లు సమావేశానికి డుమ్మా కొట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.