: మన మెదడును కాపీ చేస్తే...


మనిషి మేధస్సుకు మూలం మెదడు. ఇది కొందరికి అసాధారణంగా పనిచేస్తుంది. కొందరికి సామాన్యంగా పనిచేస్తుంది. అసాధారణంగా పనిచేసేవారు దూరమైతే... అప్పుడు వారి మేధస్సును మనం కోల్పోవాల్సి ఉంటుంది. అలాకాకుండా వారి మేధస్సును గనుక మనం కంప్యూటర్‌లో కాపీ చేసుకుంటే... వారు మరణించినా, వారి మేధస్సును మనం ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి పరిజ్ఞానం వస్తుందని స్టీఫెన్‌ హాకింగ్‌ అంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అద్భుత మేధావిగా పేరుపొందిన హాకింగ్‌, 21 సంవత్సరాల వయసుకే అరుదైన మోటార్‌ న్యూరాన్‌ వ్యాధికి గురయ్యాడు. అప్పటినుండి ఆయన కేవలం చక్రాల కుర్చీకే పరిమితమైపోయాడు. అయినప్పటికీ తనకు వచ్చిన వ్యాధి గురించి ఆయన ఎప్పుడూ దిగులుపడింది లేదు. చక్రాల కుర్చీనుండే తనలోని మేధస్సును ప్రపంచానికి పంచేందుకు శ్రమించారు. గొప్ప భౌతికశాస్త్రవేత్తగా మారాడు. ఆయన జీవితాన్ని డాక్యుమెంటరీ రూపంలో చిత్రించారు.

ఈ డాక్యుమెంటరీ చిత్ర ముందస్తు ప్రదర్శన సందర్భంగా హాకింగ్‌ 'ది గార్డియన్‌' పత్రికతో మాట్లాడుతూ మనిషి అవయవం ఒక కంప్యూటర్‌ ప్రోగ్రాంతో సమానమని, మెదడు కూడా అంతేనని, కంప్యూటర్‌ ప్రోగ్రాంను కంప్యూటర్‌లో ఎలా కాపీ చేసి ఉపయోగించుకుంటామో... మనిషి మెదడులోని మేధస్సును కూడా కంప్యూటర్‌లోకి కాపీ చేయవచ్చని, సైద్ధాంతికంగా ఇది సాధ్యమేనని అన్నారు. మనిషి శరీరం బయట కూడా మెదడులోని మేధస్సును నిల్వచేయవచ్చని, మరణం తర్వాత ప్రోగ్రాం రూపంలో మనిషి జీవించవచ్చని అంటున్నారు. ఇదేగనుక కార్యరూపం దాల్చితే చనిపోయాక మనిషి ఆత్మ తిరుగుతుంటుందని భయపడుతుంటారుకదా... దానికి బదులుగా కమ్మటి కథలను వింటున్నట్టుగా ఉంటుందని హాకింగ్‌ అన్నారు. నిజమే, హాకింగ్‌ చెప్పినట్టు మెదడును కాపీ చేసే పరిజ్ఞానం వస్తే... అప్పుడు ఎందరో మేధావుల మెదడులను కాపీ చేసుకుని ప్రపంచంకోసం ఉపయోగించుకోవచ్చుకదూ...!

  • Loading...

More Telugu News