: ఈ ప్రోటీన్‌తో కణాన్ని చంపేయవచ్చు
కణంలో ఒక సరికొత్త ప్రోటీనును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రోటీను కణంలోని ఒత్తిడి స్థాయిని సరిగ్గా లెక్కించడంతోబాటు కణ మరమ్మత్తుకు, కణ మరణానికి సంబంధించిన పథాలు సమర్థవంతంగా ఉండేలా చూస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీనిపై మరిన్ని పరిశోధనలు సాగిస్తే క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు సరికొత్త చికిత్సలను రూపొందించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
బార్సిలోనాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు కణంలో ఒత్తిడి స్థాయిని సరిగ్గా లెక్కించడంలో కీలక పాత్రను పోషించే ప్రత్యేక ప్రోటీనును గుర్తించారు. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ ప్రోటీను కణంలోని ఎండోప్లాస్మిక్ రెటికులమ్లో ఉంటుంది. కణంలోని మైటోఫ్యూజిన్2(ఎంఎఫ్ఎన్2)తో ఈఆర్ ఒత్తిడికి అనుసంధానమై ఉన్న ఈ ప్రోటీను కణంపై ఒత్తిడిని గుర్తించి దాని ఆధారంగా సహాయ ప్రతిస్పందనను, లేదా కణ మరణాన్ని ప్రోత్సహిస్తుందని తేలింది. శాస్త్రవేత్తల పరిశోధనలో ఒత్తిడి పరిస్థితుల్లో ఎంఎఫ్ఎన్2ను కణం నుండి శాస్త్రవేత్తలు తొలగించినప్పుడు మరమ్మత్తు పంథాలను ఈఆర్ మితిమీరి క్రియాశీలం చేసింది. ఇలాచేయడం ద్వారా అది కణంలోని ఒత్తిడి ఫలితాన్ని అధిగమించేలా సామర్ధ్యాన్ని తగ్గించేసి, కణ మరణం దిశగా ప్రేరేపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తేల్చారు.
ఈ ప్రోటీను కణ మనుగడకు చాలా ముఖ్యమని, నాడీ క్షీణత, క్యాన్సరు, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక వ్యాధులపై దీని ప్రభావం ఉంటుందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న జువాన్ పాబ్లో మునోజ్ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఈ ప్రోటీనుతో కణ నష్ట ప్రతిస్పందనను నియంత్రించామని, దీనిపై మరిన్ని పరిశోధనలు సాగిస్తే వ్యాధి చికిత్సలకు మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని, కణితి కణాల్లో కణ మరణ ప్రక్రియ సరిగా జరగని కారణంగా అవి పరిమితి లేకుండా వ్యాప్తి చెందుతాయని తెలిపారు. క్యాన్సర్ కణాల్లో ఎంఎఫ్ఎన్2 స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. వాటిని మనం పెంచగలిగితే కణ మరణాన్ని ప్రేరేపించడానికి వీలవుతుందని, ఈ విధంగా క్యాన్సర్ కణాలను నశింపజేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.