: అలాంటి వారికి ఆత్మాభిమానం కాస్త ఎక్కువేనట
కొందరికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫేస్బుక్లో ఇలాంటి వారిని ఇట్టే గుర్తుపట్టేయవచ్చట. ఇప్పుడు చాలామంది ఫేస్బుక్లో సభ్యులుగా ఉన్నారు. ఇలాంటి వారిలో కొందరు మాత్రం తరచూ తమ ప్రొఫైల్ మారుస్తుంటారు. ఎప్పటికప్పుడు తమ ఫోటోలను అప్డేట్ చేస్తుంటారు. ఇలాంటి వారికి ఆత్మాభిమానం కాస్త ఎక్కువగానే ఉంటుందని ఈ విషయాన్ని పరిశోధకులు ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించి చెబుతున్నారు.
ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు ఫోటోలను అప్డేట్ చేస్తూ ఉండేవారికి తమపై తమకు నమ్మకం, గౌరవం ఉంటుందట. ఇలా ఉంటేనే వారు అలా చేయగలుగుతారని అమెరికాకు చెందిన ఒక ప్రవాస భారతీయ శాస్త్రవేత్త చెబుతున్నారు. ఈ విషయంపై ఆయన పెన్సిల్వేనియాలోని మీడియా ఎఫెక్ట్స్ రీసెర్చ్ లేబరేటరీ తరపున ఫేస్బుక్ వినియోగించే యువతపై పరిశోధన సాగించారు. ఈ పరిశోధనలో ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు తమ ప్రొఫైల్ మార్చుకుంటూ ఉండేవారితో పోలిస్తే తమ ప్రొఫైల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయనివారు ఇతరులు తమ గురించి ఏం అనుకుంటారో అనే విషయంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారని తేలింది.
ఇలాంటి వారు అవసరమైతే ఇతరుల వ్యాఖ్యలనుబట్టి తమ ప్రొఫైల్ను మార్చుకుంటారట కూడా. ఈ పరిశీలనలో కొన్ని వందల మంది యువతీయువకుల తీరుతెన్నులను పరిశీలించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. అయితే ఫేస్బుక్ అనేది పైకి సామాజిక మాధ్యమంగా కనిపించినా ఇది అసలు సిసలైన వ్యక్తిగత మాధ్యమమని, మనలోని ఆత్మవిశ్వాసాలు, న్యూనతలను వెల్లడించే ఒక వేదికగా మారిందని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన వారు చెబుతున్నారు.