: శ్రీనివాసన్ అల్లుడిపై ముంబై పోలీసుల ఛార్జ్ షీట్
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సీఈవో గురునాథ్ మెయ్యప్పన్ పై ముంబై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో గురునాథ్ ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా బెట్టింగ్ చేయడంతో పాటు ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. గురునాథ్ తో పాటు పాకిస్థానీ అంపైర్ అసద్ రవూఫ్ పేరుని కూడా ఛార్జ్ షీట్ లో చేర్చారు. బెట్టింగ్ వ్యవహారంలో గురునాథ్ పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని ముంబై పోలీసులు తెలిపారు. అతని ఫోన్ కాల్స్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, బుకీల సిమ్ కార్డుల కోసం వినియోగించిన డాక్యుమెంట్లకు సంబంధించిన అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.
బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటున్న శ్రీనివాసన్ కు గురునాథ్ అల్లుడు అన్న సంగతి తెలిసిందే. అల్లుడిపై ఐపీఎల్-6 సందర్భంగా బెట్టింగ్ ఆరోపణలు రావడంతో.. శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష పదవిని వీడాలని అన్ని వైపుల నుంచి ఒత్తిళ్ళు వచ్చాయి. దీంతో, ఆయన పదవికి దూరమయ్యారు.