: ఏకైక టీ20లో భారత్-ఏ ఘనవిజయం


బెంగళూరులో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్-ఏ పై భారత్-ఏ జయభేరి మోగించింది. యువరాజ్ ఆల్ రౌండ్ ప్రతిభ (52 పరుగులు, 2 వికెట్లు) కు స్పిన్నర్ రాహుల్ శర్మ (5 వికెట్లు) మాయాజాలం తోడవటంతో వెస్టిండీస్-ఏ 93 పరుగుల తేడాతో ఓటమిపాలయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యువీ సేన నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్-ఏ కేవలం 121 పరుగులకే కుప్పకూలడంతో విజయం భారత్-ఏ సొంతమైంది.

214 పరుగుల్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ కు దిగిన కరీబియన్ ఆటగాళ్లు మన బౌలర్లను ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయారు. ఓపెనర్ ఫ్లెచర్ మాత్రమే 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగిలిన ఆటగాళ్ళలో ఎవరూ మెరుగైన ఆటతీరు కనపరచకపోవడంతో వెస్టిండీస్-ఏ 16.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్ రాహుల్ శర్మ 23 పరుగులిచ్చి 5 వికెట్లను పడగొట్టాడు. వినయ్ కుమార్, యువరాజ్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఉనద్కత్ ఒక వికెట్ తీశాడు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్-ఏ ఓపెనర్లు ఊతప్ప (35), ఉన్ముక్త్ చాంద్ (47)ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. వీరిద్దరూ 6.4 ఓవర్లలో 74 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం నెలకొల్పారు. ఊతప్ప ఔట్ అయ్యాక క్రీజులోకొచ్చిన యువరాజ్ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. 35 బంతుల్లో 3 సిక్స్ లు, 4 ఫోర్లతో 52 పరుగులు చేసి స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. మిగిలిన ఆటగాళ్ళలో జాదవ్ 21 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అయితే విండీస్ బౌలర్ రస్సెల్ మ్యాచ్ 19 వ ఓవర్లో తొలి నాలుగు బంతులకు నాలుగు వికెట్లు తీశాడు. అయితే అప్పటికే విండీస్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

  • Loading...

More Telugu News